: కేబినెట్ విస్తరణపై బాబు సంకేతాలు... లాబీయింగ్ ప్రారంభించిన ముస్లిం నేతలు!
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిసారి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. విజయవాడలో ముస్లిం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తన కేబినెట్ లో ముస్లిం మంత్రిని చూస్తారని వ్యాఖ్యానించారు. ముస్లింలలో చాలా మంది పేదలు ఉన్నారని, వారంతా రాజకీయంగా, సామాజికంగా మెరుగైన స్థితికి రావడానికి తమ ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని వెల్లడించారు. 4 శాతం రిజర్వేషన్లను ముస్లింలకు కల్పించేందుకు కట్టుబడివున్నామని పునరుద్ఘాటించారు. కాగా, తెలుగుదేశం పార్టీలో ముస్లిం ఎమ్మెల్యేనే లేకపోవడం గమనార్హం. దీంతో ఆయన కేబినెట్లో సైతం ఆ వర్గానికి చెందిన వారికి స్థానం దక్కలేదు. ఇక మైనారిటీ ఓటు బ్యాంకు చేజారిపోకుండా ఉండేలా చూసుకునేందుకు బాబు ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. దీంతో పార్టీలోని ముస్లిం నేతలు తమకు మంత్రిపదవి ఇవ్వాలని అప్పుడే చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు తమదైన శైలిలో యత్నాలు ప్రారంభించారు. ఇటీవలే పార్టీలో చేరిన జలీల్ ఖాన్ తో పాటు, మాజీ మంత్రి మహమ్మద్ ఫరూక్, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ కు చెందిన షరీఫ్, గుంటూరు మాజీ ఎమ్మెల్యే జియాయుద్దిన్ తదితరులు మంత్రివర్గంలో స్థానం కోసం లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. వీరిలో ఎవరికి పదవి దక్కుతుందో వేచిచూడాలి.