: సిగరెట్ల తయారీని నిలిపేయనున్న ఐటీసీ, గాడ్ ఫ్రే ఫిలిప్స్, వీఎస్టీ!
సిగరెట్ ప్యాకెట్లపై 85 శాతం కనిపించేలా హెచ్చరికలను ముద్రించాలన్న కేంద్రం నోటిఫికేషన్ ను వ్యతిరేకిస్తూ, సిగరెట్ల తయారీని నిలిపివేయనున్నట్టు టొబాకో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (టీఐఐ) వెల్లడించింది. ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే సిగరెట్ బ్రాండ్లు కింగ్స్, క్లాసిక్, గోల్డ్‌ఫ్లేక్, నేవీకట్, కాప్‌స్టన్, బ్రిస్టల్, ఫ్లేక్, సిల్క్‌కట్ వంటి వాటిని తయారు చేస్తున్న ఐటీసీ, గాడ్ ఫ్రే ఫిలిప్స్, వీఎస్టీ వంటి కంపెనీలెన్నో సభ్యులుగా ఐన్న టీఐఐ, తాజా నిబంధనలపై మండిపడింది. నిబంధనలకు వ్యతిరేకంగా తెచ్చిన కొత్త రూల్స్ ను తాము పాటిస్తే, తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వెల్లడించింది. సిగరెట్ల తయారీ నిలిపివేత కారణంగా రోజుకు రూ. 350 కోట్ల నష్టం వాటిల్లుతుందని, అయినప్పటికీ స్పష్టత వచ్చేంతవరకూ తయారీ జోలికి పోబోమని స్పష్టం చేసింది. కాగా, ఏప్రిల్ 1 నుంచి సిగరెట్ ప్యాకెట్లపై 85 శాతం కనిపించేలా బొమ్మ, ఆపై మరింత పెద్ద అక్షరాలతో హెచ్చరిక ఉండాలని కేంద్రం నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు సిగరెట్ పై కూడా పుర్రె గుర్తు ఉండాలని కేంద్రం ఆదేశించింది. దీన్ని వ్యతిరేకిస్తున్న టీఐఐ, కోర్టును ఆశ్రయించగా, ఈలోగానే కేంద్రం తన ఆదేశాలను నోటిఫై చేసింది. ఇప్పటికిప్పుడు ముద్రణా యంత్రాలను సమకూర్చుకొని పెద్ద బొమ్మలను వేయాలంటే ఆర్థిక భారం మోయాల్సి వుంటుందని ఐటీసీ వెల్లడించింది. కోర్టులో కేసు పరిష్కారం అయ్యేవరకూ బెంగళూరు, ముంగేర్, సహరాన్ పూర్, కోల్ కతా, పుణె ఫ్యాక్టరీల్లో ఉత్పత్తిని నిలిపివేయనున్నట్టు తెలిపింది.