: అమెరికా సైన్యం చారిత్రాత్మక నిర్ణయం.. అరుదైన అనుమతి
సిక్కులకు గడ్డం, తలపాగా తప్పనిసరిగా ఉండాలన్న మతపరమైన విశ్వాసాన్ని అమెరికా సైన్యం గుర్తించింది. సర్వీసు నిబంధనలను సడలించి సైన్యాధికారి కెప్టెన్ సిమ్రత్‌పాల్ సింగ్(28)కు ఉపశమనం కల్పించింది. తలపాగాతో పాటు, ఇతర సిక్కు మత ఆచారాలను పాటిస్తూ సైన్యంలో సేవలందించేందుకు కెప్టెన్ సిమ్రత్‌పాల్ సింగ్ కు అనుమతినిస్తూ అమెరికా సైన్యం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా సైన్యంలో పనిచేస్తున్న సిక్కు మతస్థుడికి ఇటువంటి అనుమతి రావడం ఇదే తొలిసారి. సిమ్రత్‌పాల్ సింగ్ గత నెలలో అమెరికా రక్షణ శాఖపై దావా వేశారు. తన మతాచారాల ప్రకారం ధరిస్తున్న తలపాగా, గెడ్డం వల్ల తనను వివక్షకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దీంతో సిమ్రత్పాల్కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఆయన తన మతాచారాలను అనుసరిస్తూనే దేశానికి సేవ చేయవచ్చని తెలిపింది. తలపాగా, గెడ్డం వల్ల యూనిట్ ఐక్యత, నైతికత, క్రమశిక్షణ, ఆరోగ్యం, భద్రతలకు ముప్పు కలిగినపుడు మాత్రమే ఈ ఆదేశాలను ఉపసంహరిస్తామని ప్రకటించింది. గతంలో ఆయన ఆఫ్ఘనిస్థాన్‌లో రోడ్డు పక్కన బాంబులను నిర్వీర్యం చేసే కంబాట్ ఇంజినీర్ల ప్లాటూన్‌కు నేతృత్వం వహించారు. ఆయన సేవలకు గుర్తింపుగా బ్రాంజ్ స్టార్ మెడల్ లభించింది. అయితే, అప్పట్లో సర్వీసు నిబంధనల ప్రకారం ఆయన తప్పనిసరిగా గడ్డాన్ని తీసివేయాల్సి వచ్చింది.