: కేంద్రంలో దుమారం రేపుతున్న బొగ్గు స్కాం
కేంద్ర ప్రభుత్వంలో బొగ్గు కుంభకోణం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో దర్యాప్తు నివేదిక వివరాలను న్యాయశాఖ మంత్రి అశ్వినీకుమార్ కి తెలియజేశామన్న సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా మాటలు కలకలం సృష్టించాయి. దాంతో ముప్పేట దాడికి దిగిన విపక్షాలు న్యాయశాఖ మంత్రి రాజీనామా చేసి తీరాల్సిందేనని డిమాండు చేస్తున్నాయి. అటు మంత్రికి మద్దతు పలికిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్.. రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
కాగా, ఈ వ్యవహారంపై కోర్టులో జరిగే తదుపరి విచారణలో అఫిడవిట్ కు సమాధానం ఇస్తామని కేంద్రమంత్రి మనీష్ తివారీ తెలిపారు. బొగ్గు స్కాంపై ఈ ఉదయం సీబీఐ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేసిన నేపథ్యంలో స్పందించిన మంత్రి అశ్వనీకుమార్.. ఈ అంశంలో తానెలాంటి తప్పు చేయలేదన్నారు. నివేదిక వివరాలను ప్రధాని కార్యాలయానికి తెలిపామన్న అంశంపై మండిపడ్డ బీజేపీ.. ప్రధాని రాజీనామా చేయాలని ఉద్ఘాటించింది.