: టీ కాంగ్రెస్ కు షాక్!... టీఆర్ఎస్ కు మద్దతుగా కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
టీ కాంగ్రెస్ కు ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిసేపటి క్రితం షాకిచ్చారు. సాగు నీటి ప్రాజెక్టులపై టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్... మొన్న అసెంబ్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై కోమటిరెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ కు మద్దతుగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా బాగుందని కోమటిరెడ్డి మెచ్చుకున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ప్రస్తావించిన అంశాలకు కార్యరూపం ఇస్తే ఇంకా బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక టీఆర్ఎస్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లను కోమటిరెడ్డి ఆకాశానికెత్తేశారు. హైదరాబాదులో లక్ష ఇళ్లతో పాటు ప్రతి గ్రామానికి 50 ఇళ్లను నిర్మిస్తే... కేసీఆర్ కు ఓటేయమని తానే ప్రజలకు చెబుతానని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు టీ కాంగ్రెస్ లో కలకలం రేపనున్నాయి.