: హరికృష్ణ వచ్చారు!... బెజవాడలో అంతా ఏకమయ్యారు!
నిజమే. టీడీపీ సీనియర్ నేత, సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ ఎంట్రీతో బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు కలిశారు. అంతా హరికృష్ణ చుట్టూ కూర్చుని నవ్వుతూ, తుళ్లుతూ కనిపించారు. విజయవాడలోని బందరు రోడ్డులో ఎన్టీఆర్ వెటర్నిటీ సూపర్ స్సెషాలిటీ ఆసుపత్రి పేరిట ఓ కొత్త ఆసుపత్రిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఆసుపత్రి నిర్మాణానికి హరికృష్ణ తనవంతుగా కోటి రూపాయలకు పైగా విరాళం అందజేశారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఆసుపత్రిని నేటి ఉదయం వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సహా పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ హరికృష్ణ... వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)తో కలిసి ఒకే కారులో వచ్చారు. హరికృష్ణతో కలిసి ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన కొడాలి నాని... హరికృష్ణ, గద్దె రామ్మోహన్ రావులకు మధ్య కాస్తంత వెనుకగా కూర్చున్నారు. హరికృష్ణ పక్కన దేవినేని ఉమా కూర్చున్నారు. ఈ సందర్భంగా హరికృష్ణ, గద్దెలతో కొడాలి నాని నవ్వుతూ మాట్లాడారు. టీడీపీ నేతల మధ్య కొడాలి నాని కూర్చున్నారన్న వార్త సంచలనం రేపిన మరికాసేపట్లోనే అక్కడ మరో కీలక వ్యక్తి ప్రత్యక్షమయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్ అక్కడికి వచ్చారు. హరికృష్ణను కలిశారు. పనిలో పనిగా అక్కడ ఉన్న టీడీపీ నేతలను ఆయన పలకరించారు. హరికృష్ణను మర్యాదపూర్వకంగా కలిసేందుకు తాను వచ్చానని ఆ తర్వాత అవినాశ్ ప్రకటించారు. వెరసి బెజవాడకు వచ్చిన హరికృష్ణ అన్ని ప్రధాన పార్టీల నేతలను ఒక్కదరికి చేర్చి ఆసక్తికర సన్నివేశానికి శ్రీకారం చుట్టారు.