: మధ్యప్రదేశ్ లో కిరాతకం!... జనం చూస్తుండగానే యువకుడిని కొట్టిచంపిన దుండగులు


మధ్యప్రదేశ్ లో అత్యంత కిరాతక ఘటన చోటుచేసుకుంది. జనం చూస్తుండగానే నడి రోడ్డుపై కొందరు దుండగులు కర్రలు, ఇనుప రాడ్లతో ఓ యువకుడిపై దాడి చేసి చంపేశారు. దుండగుల దెబ్బలకు తాళలేని ఆ యువకుడు ఆర్తనాదాలు చేస్తున్నా స్పందించిన నాథుడు ఒక్కరూ లేకపోయారు. అత్యంత భయానకంగా జరిగిన ఈ దాడి దృశ్యాలను నేటి ఉదయం జాతీయ, ప్రాంతీయ న్యూస్ ఛానెళ్లు ప్రధానంగా ప్రసారం చేశాయి. వివరాల్లోకెళితే... మధ్యప్రదేశ్ లోని కండువా జిల్లాకు చెందిన మాతా చౌక్ కు చెందిన ఆకాశ్, వికాస్ అనే ఇద్దరు సోదరులు నిన్న పొలానికి వెళ్లారు. అప్పటికే వీరితో తగాదా ఉన్న కొంతమంది దుండగులు వారిపై దాడి చేశారు. ఈ క్రమంలో ఆకాశ్ తప్పించుకుని పారిపోగా, వికాస్ దుండగుల చేతికి దొరికిపోయాడు. పొలం నుంచి రోడ్డుపైకి వికాస్ ను ఈడ్చుకుని వచ్చిన దుండగులు కర్రలు, ఇనుప రాడ్లతో అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో దెబ్బలు తాళలేక వికాస్ చేసిన ఆర్తనాదాలు అక్కడ ఉన్న ఏ ఒక్కరిని కదిలించలేకపోయాయి. ఈ క్రమంలో ఎవరో చేసిన ఫిర్యాదుతో వేగంగా స్పందించిన పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసిన దుండగులు అక్కడి నుంచి పరారు కాగా, కొన ప్రాణాలతో ఉన్న వికాస్ ను పోలీసులు ఆసుపత్రికి తరలించే యత్నం చేశారు. ఈలోగానే వికాస్ తుది శ్వాస విడిచాడు. ఈ మొత్తం ఘటనను ఓ వ్యక్తి గుట్టుచప్పుడు కాకుండా సెల్ ఫోన్ లో రికార్డు చేసి పోలీసులకు అందజేశాడు. ఈ వీడియోనే న్యూస్ ఛానెళ్లలో ప్రసారమైంది.

  • Loading...

More Telugu News