: నా రాజకీయ జీవితం జగన్ తోనే!... ఎన్టీఆర్ పేరిట ఆసుపత్రి అంటేనే ఇక్కడికి వచ్చా!: కొడాలి నాని
టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణతో కలిసి ఒకే కారులో వచ్చి దిగిన వైసీపీ నేత, కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) నేటి ఉదయం ఏపీ రాజకీయాల్లో పెను చర్చకు తెర తీశారు. అయితే అంతలోనే ఆ చర్చలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి ఉదయం విజయవాడలోని బందరు రోడ్డులో ఎన్టీఆర్ వెటర్నిటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నందమూరి హరికృష్ణతో కలిసి కొడాలి నాని హాజరయ్యారు. వారిద్దరూ ఒకే కారులో వచ్చి అక్కడి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. కొద్దిసేపటి క్రితం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. తన ఆరాధ్య దైవం దివంగత నందమూరి తారకరామారావు పేరిట ఆసుపత్రి ప్రారంభోత్సవమని తెలిసిన కారణంగానే ఈ కార్యక్రమానికి హాజరయ్యానని ఆయన పేర్కొన్నారు. అంతేకాక ఈ ఆసుపత్రికి తన గురువు నందమూరి హరికృష్ణ నిధులిచ్చారని, అందుకే ఆయనతో కలిసి వచ్చానని తెలిపారు. ఎన్ని పార్టీలు మారినా, తనకు హరికృష్ణే గురువని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే కలిసి నడుస్తానని ఆయన ప్రకటించారు. తన రాజకీయ జీవితమంతా జగన్ తోనే సాగుతుందని కూడా కొడాలి నాని పేర్కొన్నారు.