: ఇదేం పద్ధతి?... సాయంపై కేంద్రానికి ఘాటు లేఖ రాయనున్న చంద్రబాబు!
కేంద్రంలోని బీజేపీ సర్కారును నిలదీసేందుకు ఏపీలోని టీడీపీ ప్రభుత్వం దాదాపుగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక లోటులో చిక్కుకున్న రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం చేస్తున్న సాయంపై సీఎం నారా చంద్రబాబునాయుడు కాస్తంత గుర్రుగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీ మేరకు పావలా వంతు కూడా సాయం అందలేదని, ఈ కారణంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు మరికాసేపట్లో విజయవాడలో ప్రారంభం కానున్న కేబినెట్ భేటీలో ఆయన ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా కేంద్రం నిర్లక్ష్య వైఖరిపై ప్రధాని నరేంద్ర మోదీకి ఘాటుగా లేఖ రాయాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. ఈ విషయంలో తన కేబినెట్ సహచరులతో చర్చించి ఆయన ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కేంద్రానికి ఘాటుగా లేఖ రాయాలన్న యోచనకే చంద్రబాబు మొగ్గుచూపితే... టీడీపీ, బీజేపీల మధ్య కొనసాగుతున్న మైత్రి కూడా ప్రమాదంలో పడే అవకాశాలు లేకపోలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.