: దురదృష్టం కాలు పోగొడితే... అదృష్టం అందలం ఎక్కించింది!
దురదృష్టం కాలు పోగొడితే...అదృష్టం అందలం ఎక్కించిన ఘటన ఏపీ రాష్ట్ర సరిహద్దుల్లో చోటుచేసుకుంది. అనంతపురానికి చెందిన పొన్నయ్య భవన నిర్మాణ కూలిగా పని చేస్తుండేవాడు. ఓ సారి పనిచేస్తూ భవనం పై నుంచి కిందపడడంతో కాలు విరిగిపోవడంతో దానిని తీసేశారు. స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన కృత్రిమ కాలుతో భిక్షాటన చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, ఉన్న ఊరిలో భిక్షాటన చేసేందుకు మనస్కరించక తమిళనాడు సరిహద్దుల్లోని మార్తాండం (కేరళ) బస్టాండ్ లో భిక్షాటన చేస్తున్నాడు. అలా భిక్షాటన చేయగా వచ్చిన మొత్తాన్ని భార్యకు పంపిస్తూ, కొంత మొత్తంతో లాటరీ టికెట్లు కొనడం ప్రారంభించాడు. రెండు రోజుల క్రితం పోలీసులు వచ్చి పొన్నయ్యను స్టేషన్ కు తీసుకెళ్లారు. దీంతో బెంబేలెత్తిన పొన్నయ్యకు వారితో వచ్చిన వ్యక్తి అసలు విషయం చెప్పాడు. పొన్నయ్యకు లాటరీలో 65 లక్షల రూపాయలు బహుమతిగా వచ్చిందని తెలిపాడు. దీంతో పొన్నయ్య ఇంటికి కబురుపెట్టిన పోలీసులు, పొన్నయ్య అనుమతితో ఆ బహుమతి మొత్తాన్ని అతని భార్య, తండ్రి, సోదరులకు అందజేశారు. ఈ డబ్బుతో తన కుటుంబ కష్టాలు తీరుతాయని, పిల్లలు ఉన్నత చదువులు చదువుకుంటారని పొన్నయ్య ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే ఇంత డబ్బు వచ్చినా భిక్షాటన మాననని, ఇక్కడే ఉండి భిక్షాటన చేస్తానని పొన్నయ్య చెప్పడం విశేషం.