: పోలీసుల దర్యాప్తును ఈజీ చేసిన యాక్సిడెంట్ బాధితుడు!
పోలీసులకు పక్కా సాక్ష్యాలతో ఫిర్యాదు చేస్తే, కేసును ఛేదించడం వారికి మరింత ఈజీ అవుతుంది. అందుకే, గుర్గావ్ కు చెందిన ప్రతీక్ కుమార్ అనే యువకుడు తనకు జరిగిన భారీ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పక్కా సాక్ష్యాన్ని కూడా తనే సేకరించి పోలీసుల దర్యాప్తును ఈజీ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే... మార్చి 28న ప్రతీక్ కుమార్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన మూడేళ్ల కుమారుడితో కలిసి సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. గుర్గావ్ మార్కెట్ ప్రాంతంలోకి రాగానే వేగంగా వచ్చిన హోండా కారు ప్రతీక్ కుమార్ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ప్రతీక్ కుమార్ ఆ కారు బానెట్ పై పడగా, అతని కుమారుడు రోడ్డుమీదపడ్డాడు. పిల్లాడికేమీ గాయాలు కాలేదు. అయితే, కారు డ్రైవర్ భయంతో ఆపకుండా, బానెట్ మీద ప్రతీక్ పడి ఉండగానే, అలాగే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. కిలోమీటర్ దూరం తరువాత ప్రతీక్ కింద పడ్డాడు. ఇంతలో ఇంకో వాహనం అతన్ని గాయపరిచింది. అనంతరం స్థానికుల సాయంతో చికిత్స చేయించుకున్న ప్రతీక్ కుమార్ పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేశాడు. అయితే యాక్సిడెంట్ జరిగిందనడానికి సాక్ష్యం కూడా వుంటే మరింత బాగుంటుందని భావించిన బాధితుడు ప్రతీక్, యాక్సిడెంట్ జరిగిన మార్కెట్ లోని దుకాణాల వద్దకు వెళ్లి, యాక్సిడెంట్ కు సంబంధించిన సీసీటీవీ పుటేజ్ ను సేకరించి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.