: ‘షార్’ స్కూల్లో లైంగిక వేధింపులు!... నలుగురు టీచర్లపై సస్పెన్షన్ వేటు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం(షార్)లో నిన్న దారుణ ఘటన వెలుగు చూసింది. షార్ లో కొనసాగుతున్న సెంట్రల్ స్కూల్లో విద్యనభ్యసిస్తున్న ఆ సంస్థ ఉద్యోగుల పిల్లలపై కొందరు ఉపాధ్యాయులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. గత కొంతకాలంగా కొనసాగుతున్న ఈ వేధింపులను మొన్నటిదాకా పంటి బిగువున భరిస్తూ వచ్చిన చిన్నారులు నిన్న తమ తల్లిదండ్రుల ముందు బోరున విలపించారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులు తమను వేధిస్తున్న తీరును వివరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్నారుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు... చిన్నారులపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. వీరిలో ముగ్గురు పర్మినెంట్ ఉద్యోగులు కాగా, మరో కీచకుడు కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడు.