: ‘కుర్చీ’ కోసం ’తుపాకీ’ బెదిరింపులు!... ఏపీ హౌస్ ఫెడ్ లో కలకలం!


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని ఏపీ హౌస్ ఫెడ్ కార్యాలయంలో నిన్న చోటుచేసుకున్న ఘటన కలకలాన్ని రేపింది. హౌస్ ఫెడ్ చైర్మన్ పదవి కోసం ఇద్దరు వ్యక్తులు తుపాకులతో బెదిరించుకునే దాకా పరిస్థితి వెళ్లడం అధికార వర్గాల్లోనూ పెద్ద చర్చకు తెర లేపింది. వివరాల్లోకెళితే... రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్న సమయంలో హౌస్ ఫెడ్ చైర్మన్ పదవి గోపాల్ రెడ్డికి దక్కింది. ఇక వైస్ చైర్మన్ గా రామ్మోహన్ పదవీ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా మూడేళ్ల తర్వాత గోపాల్ రెడ్డి తన చైర్మన్ పదవిని రామ్మోహన్ కు అప్పగించాలని వారిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈలోగానే రాష్ట్ర విభజన జరగడంతో, అందివచ్చిన సాంకేతిక కారణాలను చూపుతూ గోపాల్ రెడ్డి పదవి నుంచి దిగిపోయేందుకు ససేమిరా అంటున్నారు. మరో మూడు నెలల్లో గోపాల్ రెడ్డి పదవీ కాలం కూడా ముగియనుంది. ఈ క్రమంలో కనీసం ఈ మూడు నెలలైనా తనకు చైర్మన్ కుర్చీని ఇవ్వాలని రామ్మోహన్... గోపాల్ రెడ్డిపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే అందుకు గోపాల్ రెడ్డి ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో నిన్న పిస్టల్ జేబులో పెట్టుకుని కార్యాలయానికి వచ్చిన రామ్మోహన్... నేరుగా గోపాల్ రెడ్డి ఛాంబర్ లోకి వెళ్లి చైర్మన్ కణతకు తుపాకీ గురిపెట్టారట. తక్షణమే చైర్మన్ పదవి నుంచి దిగి, తనకు అవకాశం కల్పించాలని ఆయన బెదిరింపులకు దిగారు. అయితే గోపాల్ రెడ్డి కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా, చైర్మన్ పదవి నుంచి దిగేది లేదని చెప్పేశారు. అంతటితో ఆగని గోపాల్ రెడ్డి... ఈ వ్యవహారాన్ని సంస్థ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News