: కూలిన కోల్ కతా ఫ్లై ఓవర్ నిర్మాణ కంపెనీ మనదే!... ఆఫీస్ సీజ్
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో నిర్మాణం పూర్తి కాకుండానే కుప్పకూలిన ఓ ఫ్లై ఓవర్... ఏకంగా 21 మంది ప్రాణాలను బలిగొంది. సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డైన ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూసిన వారి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను చేబట్టిన కంపెనీ తెలుగు నేలకు చెందినదేనట. తెలుగు నేలలోనే కాక దేశవ్యాప్తంగా మౌలిక వసతుల సదుపాయాల కల్పనలో ప్రముఖ కంపెనీగా ఎదిగిన ‘ఐవీఆర్సీఎల్’ ఈ ఫ్లై ఓవర్ పనులు చేస్తోంది. నిన్నటి ప్రమాదం నేపథ్యంలో కోల్ కతాలోని ఐవీఆర్సీఎల్ కు చెందిన కార్యాలయాన్ని ఆ రాష్ట్ర అధికారులు మూసివేశారు. కంపెనీపై కేసు నమోదు చేసినట్లు ఆ రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఇక ప్రమాదంపై స్పందించిన కంపెనీ ప్రతినిధి పాండురంగారావు దానిని ‘దైవ ఘటన’గా అభివర్ణించారు. ఈ ప్రకటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘోర ప్రమాదాన్ని ‘దైవ ఘటన’గా అభివర్ణిస్తూ కంపెనీ బాధ్యతారహితంగా వ్యవహరించిందని ఆమె మండిపడ్డారు.