: ఆ ప్రాజక్టులను కేసీఆర్ ఎలా నిర్మిస్తారో చెప్పాలి: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో చేబడుతున్న నీటిపారుదల ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో శాసనసభను ఆకట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చెప్పినవన్నీ ఇంతకుముందు సీడబ్ల్యూసీ రికార్డుల్లో ఉన్నవేనని తేల్చారు. కేసీఆర్ చెప్పాల్సింది...వాటిని ఎలా పూర్తి చేస్తారన్నదే అని, అది మానేసి మిగిలినవన్నీ ఆయన చెప్పుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ఎలా పూర్తి చేస్తారో వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ తో ప్రజలపై భారం పడదా? అని ఆయన ప్రశ్నించారు. అలాగే తుమ్మిడిహట్టి నుంచి మహారాష్ట్ర నీటిని తరలించదని కేసీఆర్ హామీ ఇవ్వగలరా? అని ఆయన అడిగారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఎత్తును ఎందుకు తగ్గించారని ఆయన నిలదీశారు. సీడబ్ల్యూసీ ఒప్పందం లేకుండా ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తారని ఆయన ప్రశ్నించారు. పెన్ గంగ ప్రాజెక్టుపై మహారాష్ట్ర అక్రమంగా 30 ప్రాజెక్టులు కట్టిందని ఆయన తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు, సీఎం కేసీఆర్ రహస్య ఒప్పందం ఏదైనా చేసుకున్నారా? అని ఆయన అడిగారు.