: తెలంగాణ ట్యాగ్ లైన్లు... నిధులు, నియామకాలు, నీళ్లే!: కేసీఆర్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏ ప్రాతిపదిక మీద మొదలైందన్న విషయాన్ని టీఆర్ఎస్ అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోమారు వెల్లడించారు. కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభించిన సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రత్యేక తెలంగాణ వాదం కేవలం.... నిధులు, నియామకాలు, నీళ్లు... అన్న మూడు అంశాల ప్రాతిపదికపైనే పురుడుపోసుకుందన్నారు. ఉద్యమ లక్ష్యం నెరవేరడం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం... ఆ తర్వాత ఉద్యమాన్ని ముందుండి నడిపిన తమ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారన్నారు. ఈ క్రమంలో ఉద్యమానికి ప్రాతిపదికలుగా తాము పేర్కొన్న అంశాల్లో ఇప్పటికే నిధులను రాబట్టగలిగామన్నారు. అలాగే నియామకాలు కూడా చేపట్టామన్నారు. ఇక నీళ్ల కోసం ప్రజలతో పాటు తాము కూడా ఎదురుచూస్తున్నామని ఆయన చెప్పారు. ఇందుకోసమే ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుకు రీడిజైనింగ్ కు శ్రీకారం చుట్టామని కేసీఆర్ తెలిపారు.