: ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం: నేడు బలపరీక్ష లేనట్టే
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో నేడు జరపాల్సిన బలపరీక్ష వాయిదా పడింది. నేడు శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా సీఎం హరీశ్ రావత్‌కి సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.ఎం. జోసెఫ్, జస్టిస్ వి.కె. బిస్త్‌లతో కూడిన ధర్మాసనం స్టే విధించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 6వ తేదీకి వాయిదా వేసింది. కేంద్రం తరఫున వాదిస్తున్న అటార్నీ జనరల్(ఏజీ) ముకుల్ రోహత్గీ.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్‌చేస్తూ వేసిన పిటిషన్‌ను డివిజన్ బెంచ్ విచారించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని ఏజీ అన్నారు. మెజారిటీని నిరూపించుకునేందుకు మార్చి 31న డేట్ వుండగా.. హడావుడిగా మార్చి 27న రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఏంటని కోర్టు అడిగింది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై స్టే విధిస్తూ ముఖ్యమంత్రి హరీశ్‌రావత్ ను ఈ నెల 31లోగా శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా బల నిరూపణలో పాల్గొనాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. దీంతో ఉత్తరాఖండ్ శాసనసభలో హరీశ్‌రావత్ బలనిరూపణ కార్యక్రమం ఈరోజు జరగాల్సి ఉంది. బలనిరూపణ జరిగితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హరీశ్‌రావత్ కొనసాగడం లేదా రాష్ట్రపతి పాలన.. ఏదనేది తేలిపోయేది. అయితే, హైకోర్టు విధించిన బలనిరూపణ అంశంపై కేంద్ర ప్రభుత్వం సవాలు చేసింది. ఈ విషయమై హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహ్‌తగి నిన్న వాదనలు వినిపించారు.