: టీ-అసెంబ్లీలో కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్... ఏర్పాట్లు పూర్తి


సమగ్ర జలవిధానంపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనున్నారు. మరి కొద్ది సేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. గూగుల్ ఎర్త్ సాయంతో దాదాపు మూడున్నర గంటల పాటు తెలంగాణ జల విధానాన్ని ఆయన వివరించనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. మొత్తం మూడు స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఒకటి స్పీకర్ ముందు, రెండోది అధికారపక్ష సభ్యుల ముందు, మూడో స్క్రీన్ ను విపక్ష సభ్యుల ముందు ఏర్పాటు చేశారు. శాసనమండలిలో సభ్యుల కోసం మరో స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు విభాగాలుగా ఈ ప్రజెంటేషన్ కార్యక్రమం ఉంటుంది. మొత్తం 108 పవర్ పాయింట్ స్లైడ్స్ ను ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా ప్రాజెక్టులు, తాగునీటికి ఉన్న అవకాశాలను వివరిస్తారు. కాగా, ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అసెంబ్లీ చరిత్రలోనే మొట్టమొదటిసారి అవుతుంది. హెలికాఫ్టర్ల ద్వారా తీసినటువంటి చిత్రాలు, కేంద్ర ప్రభుత్వ సర్వే సంస్థల సర్వే వివరాలతో ఈ ప్రజెంటేషన్ జరగనుంది. ముఖ్యంగా 1956 నుంచి 2016 వరకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ కోసం కట్టిన ప్రాజెక్టులెన్ని, ఎన్ని టీఎంసీల నీరు వినియోగించే విధంగా వాటిని కట్టారు, మహారాష్ట్ర, గోదావరి నదీ జలాలను వినియోగించుకుంటున్న ఇతర రాష్ట్రాల్లో ఎన్ని వందల ప్రాజెక్టులు కట్టారు.. తెలంగాణలో ఎందుకు కట్టలేకపోయారనే విషయాలు చర్చకు రానున్నాయి. కాగా, మంత్రులతోను, సాగునీటి పారుదల నిపుణులు, అధికారులతోను సీఎం కేసీఆర్ నిన్న ఈ విషయంపై లోతుగా చర్చించారు.

  • Loading...

More Telugu News