: ఎంపీ కొత్తపల్లి గీత భర్త కిడ్నాప్.. విడుదల!...భూమి కోసం తలసాని కొడుకు పనేనని పోలీసులకు ఫిర్యాదు
కోట్లాది రూపాయల విలువైన భూ వివాదం... విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త పరుచూరి రామకోటేశ్వరరావు కిడ్నాప్ నకు దారి తీసింది. నిన్న రాత్రి హైదరాబాదులో కలకలం రేపిన ఘటనలో కిడ్నాపర్లు ఆయనను అర్ధరాత్రి సమయంలో కొండాపూర్ పరిధిలో వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఎంపీ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకెళితే... ఎంపీ గీత కుటుంబానికి హైదరాబాదు గచ్చిబౌలిలో రూ.75 కోట్ల విలువ చేసే ఐదెకరాల భూమి ఉంది. రామకృష్ణ, సుధాకర్ రావు అనే ఇద్దరు వ్యక్తులకు ఎంపీ భర్త సదరు భూమిని డెవలప్ మెంట్ కు ఇచ్చారు. అభివృద్ధి పేరిట భూమిని తీసుకున్న డెవలపర్లు... ఎంతకీ పనులు మొదలుపెట్టకపోవడంతో గీత భర్త తిరిగి దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని తన ఇంటి నుంచి బయటకు వచ్చిన రామకోటేశ్వరరావును డెవలపర్లు మాట్లాడదాం రమ్మంటూ కారెక్కించుకుని ఓ హోటల్ కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో భర్తకు ఫోన్ చేసిన గీతకు దాదాపు రెండు గంటల పాటు అటు వైపు నుంచి స్పందన రాలేదు. దీంతో ఆందోళనకు గురైన గీత కారు డ్రైవర్ కు ఫోన్ చేయగా, అసలు విషయం తెలిసింది. దీంతో ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు సమాచారం అందించిన ఆమె... హైదరాబాదు పోలీసులు, తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రామకోటేశ్వరరావు నుంచి అర్ధరాత్రి గీతకు ఫోన్ వచ్చింది. కిడ్నాపర్లు తనను కొండాపూర్ పరిధిలో వదిలేశారని ఆయన ఎంపీకి చెప్పారు. ఇదే విషయాన్ని సదరు తెలుగు న్యూస్ ఛానెల్ కు చెప్పిన గీత... భూమి విషయంలో నెలకొన్న వివాదమే తన భర్త కిడ్నాప్ నకు దారి తీసిందని చెప్పారు. మాట్లాడుకుందాం రమ్మని పిలిచిన రామకృష్ణ, సుధాకర్ రావులు... హోటల్ లో తన భర్తను శారీరకంగానే కాక మానసికంగానూ చిత్రహింసలకు గురి చేశారని చెప్పారు. ఆ తర్వాత భూమి పత్రాలు లాక్కుని, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని వదిలేశారని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు సాయి హస్తం ఉందని ఆమె ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై తన భర్త పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారని కూడా ఆమె పేర్కొన్నారు.