: బీహార్‌లో ఇకపై ప్రభుత్వోద్యోగాల్లో హిజ్రాలు!
బీహార్‌లో హిజ్రాలు ఇకపై ప్రభుత్వోద్యోగాలు చేయనున్నారు. హిజ్రాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ బీహార్ అసెంబ్లీలో ఈ రోజు ఆ రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి మంజు వర్మ ప్రకటన చేశారు. వారి సంక్షేమం కోసం ఒక బోర్డును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2014లో సుప్రీంకోర్టు.. దేశవ్యాప్తంగా థర్డ్ జండర్ కేటగిరి కింద వీరికి విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో అనుమతి ఇవ్వాలని సూచించిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి హిజ్రాలను థర్డ్ జండర్ గా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా, ప్రధాన జీవన స్రవంతిలో కలిసేందుకు వారికి మరిన్ని అవకాశాలను కల్పించింది.