: చైనాలో ట్రంప్ కు పెరిగిన ఆదరణ
అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో చైనీయులు సంబరపడిపోతున్నారు. దీంతో డెమెక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కంటే డొనాల్డ్ ట్రంప్ అంటేనే తమకు ఇష్టమని చెబుతున్నారు. దీనిపై హువాంగ్ క్వియు.కామ్ సంస్థ ఓ సర్వే నిర్వహించగా 54 శాతం మంది చైనీయులు డొనాల్డ్ ట్రంప్ అంటే ఇష్టం అని చెప్పడం విశేషం. ఇందుకు కారణమేంటంటే, అమెరికాలో స్థిరపడిన చైనీయుల వల్లే అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోతోందని, అమెరికన్ యువకులకు అందాల్సిన చాలా అవకాశాలను చైనీయులు తన్నుకుపోతున్నారని, తాను అధికారంలోకి వస్తే వారందర్నీ స్వదేశాలకు పంపేస్తానంటూ ట్రంప్ పలు సందర్భాల్లో తూలనాడుతున్నారు. ఆయన వ్యాఖ్యల్లో అమెరికన్ల కంటే చైనీయులే తెలివైనవారు అనే భావం స్పురిస్తోంది. దీంతో చైనాలో ఆయనకు ఎక్కువ మంది అభిమానులుగా మారుతున్నారు. అంతేకాకుండా, ఆసియా ఫసిఫిక్ పై అమెరికా అనుసరిస్తున్న విదేశాంగ విధానం హిల్లరీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉండగా తయారైంది. ఇది కూడా ఆమె కంటే ట్రంప్ ను చైనీయులు అభిమానించేలా చేస్తోంది.