: వైద్యులకు డబ్బు సంపాదనే లక్ష్యం కారాదు: గవర్నర్ నరసింహన్
వైద్యులు ఎక్కువ ఫీజులు వసూలు చేయడం తగదని గవర్నర్ నరసింహన్ అన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 18, 19 వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అనంతరం నరసింహన్ మాట్లాడుతూ, రోగిని ముట్టుకుని వైద్యం చేసే విధానాన్ని వైద్యులు మర్చిపోయారని, కేవలం పరీక్షల ద్వారానే రోగాన్ని తెలుసుకునేందుకు పరిమితమయ్యారని అన్నారు. వైద్యులు మానవత్వంతో వ్యవహరించాలని, వైద్య పరికరాల ఖర్చు రాబట్టుకునేందుకని ఎక్కువ ఫీజు వసూలు చేయడం తగదని, ప్రతి ఆసుపత్రిలో చికిత్సకయ్యే ఖర్చు వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలని సూచించారు. రోగి రాగానే ఇన్సూరెన్స్ ఉందా? అని అడిగే విధానానికి స్వస్తి పలకాలని, డబ్బు సంపాదనే లక్ష్యం కారాదని నరసింహన్ హితవు పలికారు.