: కపిల్ సిబల్ కు మొట్టికాయలేసిన సుప్రీం చీఫ్ జస్టిస్
కపిల్ సిబల్ కేసు చేపట్టారంటే... ఎంతటి కేసైనా ఆయన వైపు మొగ్గాల్సిందే. అందుకే ఆయనను తమ కేసులో వాదించాలని కోరుకోని వారుండరంటే ఆశ్చర్యం కాదు. అంతటి పేరున్న న్యాయవాదికి నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ మొట్టికాయలేశారు. వివరాల్లోకెళితే... నిన్న సహారా గ్రూపునకు చెందిన కేసు విచారణకు వచ్చింది. విచారణలో భాగంగా సహారా చీఫ్ సుబ్రతో రాయ్ తరఫున వకాల్తా పుచ్చుకున్న కపిల్ సిబల్... తనదైన శైలిలో వాదనలు వినిపించారు. మార్కెట్ పరిస్థితి బాగాలేని కారణంగా సహారా ఆస్తులను విక్రయించలేకపోతున్నామని చెప్పారు. సుబ్రతో రాయ్ ని రెండేళ్లుగా జైల్లో ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తరహా నిర్బంధం ప్రపంచంలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. ఏ ఆరోపణలు లేకుండా ఓ వ్యక్తిని రెండేళ్లకు పైగా నిర్బంధంలో ఉంచడం సరికాదని ఆక్షేపించారు. ఈ సందర్భంగా కల్పించుకున్న జస్టిస్ ఠాకూర్... ఘాటుగా స్పందించారు. ‘‘ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పవద్దు. రూ.1.87 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పుకుంటున్న పెద్ద మనిషి... కోర్టు ఆదేశించిన మేర డిపాజిట్ చేయకుండా ఎగవేయడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల విషయంలో భారతీయ న్యాయస్థానం...ప్రపంచంలోని వివిధ దేశాల న్యాయస్థానాలకు స్ఫూర్తిగా ఉందని మరవవద్దు’’ అని కపిల్ సిబల్ కు మొట్టికాయలేశారు.