: విప్‌ను ధిక్కరించిన వైసీపీ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీలో అడుగుపెట్టని వైనం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి చేరిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు వైఎస్సార్‌సీపీ మంగళ, బుధవారాల్లో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని పార్టీ సభ్యులకు విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే విప్‌ను ధిక్కరిస్తూ ఇటీవల పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలు సహా జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీకి విధిగా హాజరు కావాలని, ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని, లేకుంటే అనర్హత వేటు తప్పదని హెచ్చరించింది. విప్ ను అందుకున్న ఎమ్మెల్యే, అసెంబ్లీకి హాజరై పార్టీకి అనుకూలంగా వ్యవహరించకుంటే, వారిని ఎమ్మెల్యే పదవుల నుంచి తొలగించే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. అయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి చేరిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు.