: పాకిస్థాన్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందట.. అమెరికా విదేశాంగశాఖ వ్యాఖ్య
తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ పబ్బం గడుపుకుంటున్న పాకిస్థాన్ కు అమెరికా సహాయపడుతోందట. ఉగ్రవాదంపై పోరాడేందుకు పాకిస్థాన్ కు అమెరికా సాయం చేస్తానని గతంలో ప్రకటించిన విషయం విధితమే. అత్యాధునిక ఏహెచ్-1జెడ్ వైపర్ పోరాట హెలీకాఫ్టర్లను పాక్‌కు అందించేందుకు సిద్ధమవుతోందని, ఇరు దేశాల మధ్య హెలీకాఫ్టర్ల కోసం 3843.4 కోట్ల మేర ఒప్పందం కుదిరిందని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, ఇప్పుడు తాజాగా పాకిస్థాన్ అణ్వాయుధాలు, అణు సామగ్రిని రక్షించడానికి అమెరికా సహాయపడుతోందని ఒబామా ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు.. అణ్వాయుధాలు, సామగ్రికి భద్రత కల్పించడం విషయంలో పాకిస్థాన్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని సదరు అధికారి పేర్కొన్నారు. గతంలో పాక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పోరాట విషయంలో తాము సంతృప్తి చెందితే తప్ప తాము దానికి ఆమోదం తెలిపేది లేదని అమెరికా ప్రకటించింది. అయితే ఇప్పుడు అమెరికా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అణు సదస్సు నేపథ్యంలో పాకిస్థాన్ పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టిందని థామస్ కంట్రీమన్ అనే ఆ అధికారి తెలిపారు. భారీ విధ్వంసం చేయాలనే లక్ష్యంతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ.. అవసరమైన ఆయుధాలను సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తోందని థామస్ అన్నారు. ప్రస్తుతం అన్ని దేశాలు మాత్రం అణ్వాయుధాల రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాయని తెలిపారు. అణు భద్రతా సదస్సు నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది.