: నిరుద్యోగులకు శుభవార్త... ప్రభుత్వ కంపెనీలో ఉద్యోగానికి పరీక్ష రాసి ఫెయిలైతే, ప్రైవేటు కంపెనీలో జాబ్!
ఏపీపీఎస్సీలోనో, ఇండియన్ రైల్వేస్ లోనో ఉద్యోగం కోసం పరీక్ష రాసి ఉద్యోగం పొందడంలో విఫలమైతే, వారికి ప్రైవేటు కంపెనీలు ఉద్యోగాలను ఆఫర్ చేసే రోజులు త్వరలోనే రానున్నాయి. నిరుద్యోగులు సాధ్యమైనన్ని తక్కువ పరీక్షలు రాసి ఉద్యోగం పొందే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉద్యోగార్థులు రాత పరీక్షలు రాసిన వేళ, వారికి వచ్చిన మార్కులను ప్రకటించాలని, తద్వారా, ఉద్యోగాలకు ఎంపిక కాని వారిని ప్రైవేటు సంస్థలు తీసుకునే అవకాశాలు మెరుగవుతాయని ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ వ్యాఖ్యానించారు. "ప్రైవేటు సెక్టారుకు ఉపయుక్తకరంగా ఉండేలా ఓ పెద్ద డేటాబేస్ ను నేను అందిస్తాను. దీని ద్వారా ఉద్యోగాలు ఇచ్చేవారి చేతుల్లో నిరుద్యోగులకు చెందిన రెడీమేడ్ మెకానిజమ్ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల అటు ఉద్యోగులకు లబ్ధి చేకూరడంతో పాటు యాజమాన్యాలకు ఉద్యోగుల వెతుకులాటలో ఎంతో ఖర్చు ఆదా అవుతుంది" అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పీఎస్యూ కంపెనీలు ఖాళీలను భర్తీ చేసేందుకు విడివిడిగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. దీని వల్ల నిరుద్యోగులు ఎంతో సమయాన్ని వృథా చేసుకోవాల్సిన పరిస్థితి. మోదీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఉద్యోగ కల్పన సరళీకృతం చేయాలని ఆలోచిస్తూనే ఉన్నారు. ఆ దిశగా వేసిన మరో అడుగే ఈ అన్ ఎంప్లాయిమెంట్ డేటా బేస్. ప్రస్తుతం క్షేత్రస్థాయి ఆలోచనలకే పరిమితమైన ఈ ఆలోచన అమల్లోకి వస్తే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారతావనిలో నిరుద్యోగులకు ఎంతో మేలు కలగనుంది.