: పాక్ నుంచి వచ్చిన విచారణాధికారులను చంపాలనుకుంటున్న ఉగ్రవాదులు!
పఠాన్ కోటపై జరిగిన ఉగ్రదాడిపై విచారణ జరిపేందుకు పాకిస్థాన్ నుంచి వచ్చిన విచారణ బృందాన్ని లక్ష్యంగా చేసుకుని జీహాదీలు దాడులు జరపవచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పంజాబ్ పోలీసులకు నోట్ పంపుతూ, వారికి అదనపు భద్రతను కల్పించాలని ఆదేశించింది. భారత్, పాక్ సంయుక్త విచారణ బృందానికి పూర్తి భద్రత కల్పించాలని హోం శాఖ నుంచి ఆదేశాలు అందినట్టు పంజాబ్ పోలీసు అధికారులు వెల్లడించారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి వీరి ప్రాణాలకు ముప్పు ఉందని, ఇండియాలో ఉన్న సమయంలోనే దాడి చేయడం ద్వారా భారత్ పై బురద జల్లాలన్నది వారి అభిమతమని హోం శాఖ పేర్కొంది. కాగా, సంయుక్త విచారణ బృందాన్ని ఆహ్వానించడం ద్వారా పాక్ కు ఇండియా లొంగినట్లయిందని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఆరోపించిన సంగతి తెలిసిందే.