: ఆ సమయంలో ఆశలు వదిలేసుకున్నా: విరాట్ కోహ్లీ
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి ఇండియా సెమీఫైనల్ కు చేరి రెండు రోజులు గడుస్తున్నా, ఆ అద్భుత విజయం గురించిన ఆలోచనలు, ఆటకు సంబంధించిన కబుర్లు బయటకు వస్తూనే ఉన్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 160 పరుగులు చేయగా కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ సాయంతో 19.1 ఓవర్లలో భారత్ లక్ష్యాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత జట్టు పది ఓవర్లలోనే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో విరాట్ కోహ్లీ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిచినట్టే అనుకుని ఆశలు వదిలేసుకున్నాడట. ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. "పది ఓవర్లు ముగిసేవరకు మేము ఓడిపోతామనే అనిపించింది. అయితే, యువరాజ్, ధోనీ సాయంతో ఆట గతిని మార్చాం. ఈ గెలుపు ఎలా వచ్చిందో ఇప్పుడు నాకు తెలియడం లేదు. టీం కోసం ఏదో ఒకటి చేయాలన్నది మాత్రమే మైదానంలో నిలిచిన సమయంలో నా మనసులో ఉన్న భావన. ధోనీ విన్నింగ్ షాట్ కొట్టిన తరువాత నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఆఖరి మూడు ఓవర్లలో 39 పరుగులు కొట్టాల్సిన సమయంలో 18వ ఓవర్ వేస్తున్న ఫాల్కనర్ ను లక్ష్యంగా చేసుకోవాలని ముందే అనుకున్నా. 15 పరుగులన్నా చేద్దామనుకుంటే, 19 పరుగులు దక్కాయి. ఆపై మరింత ఆత్మవిశ్వాసంతో ఆడాము" అన్నాడు.