: వలసలతో చంద్రబాబుకే నష్టం: కరణం బలరాం సంచలన వ్యాఖ్య


పార్టీ ఫిరాయిస్తున్న నేతలతో ఏనాటికైనా, కొన్ని ప్రాంతాల్లోనైనా చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదముందని ఆ పార్టీ సీనియర్ నేత, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రకాశం జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే గొట్టిపాటిని తెలుగుదేశంలోకి చేర్చుకోవాలంటే, తనతో సంప్రదిస్తారనే భావిస్తున్నట్టు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం వలసలను ప్రోత్సహిస్తున్నప్పటికీ, దానివల్ల ఇబ్బందులనూ ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. చంద్రబాబునాయుడితో తనకున్న సంబంధాలు తెగిపోయాయని వస్తున్న వార్తలు అవాస్తవాలని, 30 ఏళ్లకు ముందు తామెలా ఉన్నామో, ఇప్పుడూ అలానే ఉన్నామని అన్నారు. ప్రత్యర్థుల నుంచి ప్రమాదం ఉందనిపించిన వేళ, కొన్నిసార్లు ముందుగానే అడుగు వేయాల్సి వస్తుందని అన్న కరణం బలరాం, తానెన్నడూ తప్పు చేయలేదని, తనపై అన్ని కేసులనూ కొట్టేశారని గుర్తు చేశారు. జిల్లాలో కిడ్నాప్ అయిన వారి గురించి ప్రశ్నించగా, ఎవరో ఎక్కడో సన్యాసుల్లోకి వెళ్లి కలిస్తే, వారి సమాచారం తనకెలా తెలుస్తుందని అన్నారు. క్యాడర్ ను నిలుపుకునేందుకు కొన్నిసార్లు పరిధులు దాటాల్సి వస్తుందని అంతమాత్రాన నేరాలు చేసినట్టు కాదని అన్నారు. తాను వైకాపాలో చేరతానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. భవిష్యత్తులో తన రాజకీయ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయన్నది ఇప్పుడే చెప్పలేనని త్వరలో 70వ పడిలో అడుగుపెట్టనున్న కరణం బలరాం వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News