: బెంగళూరులో వైద్యుడి కారు వీరంగం...బైకర్ మృతి
బెంగళూరులో ఒక వైద్యుడు తన మెర్సిడెస్ కారును అడ్డగోలుగా నడిపిన సంఘటనలో ద్విచక్రవాహన దారుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం, సిద్ధార్థ క్లినిక్ లో ఆర్థోపిడీషియన్ గా పనిచేస్తున్న డాక్టర్ శంకర్ (55), తన కూతురు, ఇంట్లో సహాయకురాలు సరిత నిన్న మధ్యాహ్నం కారులో వెళుతున్నారు. మాధవన్ పార్క్ కు చేరుకున్న తర్వాత డాక్టర్ తన కారును చాలా వేగంగా నడుపుతూ బైరాసంద్ర మెయిన్ రోడ్డు వైపు దూసుకుపోయాడు. ఈ క్రమంలో ఒక బైక్ ను, మూడు కార్లను ఢీకొట్టాడు. జయనగర్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఒక ఇంటి గోడను ఢీ కొట్టిన అనంతరం కారు ఆగిపోయింది. ఈ సంఘటనలో బైక్ నడుపుతున్న రిజ్వాన్ (52) అలియాస్ అహ్మద్ ఖాన్ అక్కడికక్కడే ప్రాణాలు విడవగా, ఆయన భార్య మొహ్ సినా బేగంకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనలో గాయపడ్డ శంకర్, ఆయన కూతురు, సహాయకురాలిని, మొహ్ సినా బేగంను సమీప ఆసుపత్రికి తరలించారు. కారు నడుపుతున్న సమయంలో డాక్టరు శంకర్ ఆల్కహాల్ సేవించాడేమోననే అనుమానంపై రక్త నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కి పంపారు. కాగా, ఈ సంఘటనపై విల్సన్ గార్డెన్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నామని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.