: అత్యుష్ణ కిరణాలు, సూపర్ లేజర్లు... నూతన ఆయుధాల తయారీలో డీఆర్డీవో!


1898లో వచ్చిన 'ది వార్ ఆఫ్ ది వరల్డ్స్' నవల నుంచి, జార్జ్ లూకాస్ సృష్టించిన 'స్టార్ వార్స్' చిత్రాల సిరీస్ లను చూశారా? వాటిల్లో వాడిన ఆయుధాలు ఎలాంటివో తెలుసుగా? అత్యుష్ణ కిరణాలను (హీట్ రేస్) శత్రువులపైకి పంపే ఆయుధాలు, సూపర్ లేజర్ గన్స్... చేతిలోని బుల్లి గన్ తో అపార నష్టం కలిగించే ఆయుధాలు... గుర్తున్నాయా? ఇవన్నీ ఒకప్పుడు ఊహాజనిత ఆయుధాలే. కానీ అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ, ఇదే తరహా ఆయుధాలను తయారు చేసే పనిలో భారత రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) నిమగ్నమై ఉంది. అత్యధిక శక్తితో దూసుకెళ్లే లేజర్లు, అంతే శక్తితో వెళ్లే మైక్రోవేవ్స్ తదితర భవిష్యత్ వ్యూహాత్మక ఆయుధాలను అమెరికాతో పాటు, రష్యా, చైనా తదితర దేశాలు అభివృద్ధి చేస్తుండగా, వారితో సమానంగా శక్తిమంతమయ్యే దిశగా భారత్ కదిలింది. 10 కిలోవాట్ల శక్తిని ప్రయోగించగల డీఈడబ్ల్యూ (డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్)లను మానవ రహిత విమానాల ద్వారా ప్రయోగించే దిశగా పరిశోధనలను ముమ్మరం చేసింది. హైదరాబాద్ లోని చెస్ (సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్) కేంద్రం నుంచి 800 మీటర్ల దూరం వరకూ వెళ్లే అత్యాధునిక డీఈడబ్ల్యూ సిస్టమ్ ను ప్రయోగించి విజయవంతమైందని తెలుస్తోంది. దీని గురించి హర్యానాలోని రామ్ గఢ్ లో ఉన్న టర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ లాబొరేటరీలో సైనికులకు వివరించి చెబితే, వారి నుంచి మంచి స్పందన వచ్చిందని సమాచారం. వచ్చే 15 సంవత్సరాల్లో భారత్ అమ్ముల పొదిలో చేర్చాల్సిన అస్త్రాల్లో ఈ డీఈడబ్లూ అత్యంత కీలకమైందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రయోగాలకు సమయం వృథా అని, డబ్బెంతో ఖర్చు పెట్టాలన్న విమర్శలు వస్తున్నప్పటికీ, ముందుకు సాగాలన్నదే తమ అభిమతమని ఆయన తెలిపారు. విమానాలకు, యుద్ధనౌకలకూ డీఈడబ్ల్యూలను జోడించడమే పరిశోధకుల ముందున్న అతిపెద్ద సవాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ప్రాథమిక ప్రయోగాలు సఫలం కావడంతో 25 కిలోవాట్ల శక్తిని కనీసం 5 నుంచి 7 కి.మీ దూరానికి పంపి విజయవంతమయ్యేలా డీఆర్డీవో తన ప్రయోగాలను ముమ్మరం చేసిందని, జూలై 2017లోగా ఈ లక్ష్యాన్ని సాధించాలని కృషి చేస్తోందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News