: దాసరి నిందితుడిగా ఉన్న కోల్ స్కామ్ లో నేడు తొలి తీర్పు!


మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి దర్శకరత్న దాసరి నారాయణరావులు ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గు కుంభకోణంలో తొలి తీర్పు నేడు రానుంది. జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ లోని ఇద్దరు డైరెక్టర్లపై వచ్చిన ఆరోపణల మీద విచారణ జరిపిన ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం తీర్పును నేటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. బొగ్గు క్షేత్రాల కేటాయింపుపై కేసు నమోదైన తరువాత వస్తున్న తొలి తీర్పు ఇదే. ఇందులో జేఐపీఎల్ డైరెక్టర్ ఆర్ఎస్ రుంగ్తా, ఆర్సీ రుంగ్తాలు నిందితులు. వీరు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, ఆపై సంతకాలు ఫోర్జరీ చేసి బొగ్గు క్షేత్రాలు పొందారన్నది ప్రధాన అభియోగం. కాగా, వీరిపై గత సంవత్సరం మార్చి 21న ఐపీసీ సెక్షన్ 120-బీ (నేరపూరిత కుట్ర), రెడ్ విత్ 420 (మోసం చేయడం), 467 (ఫోర్జరీ), 468 (మోసం చేయాలన్న ఉద్దేశంతో ఫోర్జరీ), 471 (ఫోర్జరీలను అసలైనవిగా చూపడం) వంటి సెక్షన్లపై కేసు నమోదైంది. తమతో పాటు మన్మోహన్ సింగ్, దాసరి నారాయణరావులకు కూడా డిఫెన్స్ సాక్షులుగా సమన్లు పంపాలని గత సంవత్సరం డిసెంబర్ 23న రుంగ్తాలు వేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. తదుపరి విచారణలో ఉన్న బొగ్గు కుంభకోణం కేసుల్లో దాసరి నిందితుడిగా ఉన్నారు.

  • Loading...

More Telugu News