: ‘సాక్షి’ ప్రతినిధులపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ దాడి... వైసీపీ నేతలపైనా పిడిగుద్దులు
వైసీపీ టికెట్ పై గడచిన ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జలీల్ ఖాన్ నిన్న ఆ పార్టీ నేతలపై పిడిగుద్దులు కురిపించారు. వైసీపీ టికెట్ పై విజయం సాధించినా, ఇటీవల ఆయన ఆ పార్టీకి ఝలక్కిచ్చి అధికార టీడీపీలో చేరిపోయారు. ఈ క్రమంలో పార్టీ విప్ ను అందజేసేందుకు నిన్న పార్టీ విద్యార్థి విభాగం విజయవాడ నగర అధ్యక్షుడు అంజిరెడ్డితో పాటు మరో నలుగురు నేతలు జలీల్ ఖాన్ ఇంటికి వెళ్లారు. ఈ సమాచారం అందుకున్న జగన్ కుటుంబం ఆధ్వర్యంలోని సాక్షి దినపత్రిక ఫొటోగ్రాఫర్ సుబ్రహ్మణ్యం, సాక్షి ఛానెల్ కెమెరామెన్ సంతోష్ వ్యాస్ కూడా అక్కడికి వెళ్లారు. వైసీపీ నేతలు జలీల్ ఖాన్ కు విప్ అందజేస్తుండగా, సదరు దృశ్యాన్ని చిత్రీకరించేందుకు యత్నించిన ఫొటోగ్రాఫర్, కెమెరామెన్లపై జలీల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అదనుగా జలీల్ ఖాన్ అనుచరులు వారిద్దరినీ కింద పడేసి కాళ్లతో తన్నారు. అలాగే అడ్డొచ్చిన వైసీపీ నేతలపైనా పిడిగుద్దులు గుద్దారు. ఆ తర్వాత అక్కడే ఉన్న చెక్క కుర్చీలు, ఫర్నీచర్ ముక్కలతో దాడి చేశారు. ఎలాగోలా తప్పించుకున్న వారిద్దరూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో జలీల్ ఖాన్, ఆయన అనుచరులపై ఫిర్యాదు చేశారు. జలీల్ ఖాన్ అనుచరుల దాడిలో అంజిరెడ్డికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి.