: ఈ అనుభవాలు చాలు... ఇక ఉండలేను!: జగన్ కు ముఖం మీదే చెప్పనున్న జ్యోతుల
ఏపీలో విపక్ష వైసీపీలో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. పార్టీలో కీలక నేత, శాసనసభలో ఆ పార్టీ పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ పార్టీని వీడనున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయనున్నారు. నిన్న రాత్రే తూర్పు గోదావరి జిల్లాలోని తన సొంతూరు ఇర్రిపాక నుంచి హైదరాబాదు బయలుదేరిన నెహ్రూ నేడు అసెంబ్లీ ప్రాంగణంలోని పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా పార్టీలో తనకు ఎదురైన అనుభవాలు, వాటి పర్యవసానాలను ఏకరువు పెట్టనున్న జ్యోతుల... పార్టీలో ఇమడలేకపోతున్నానని, పార్టీలో ఉండలేనని తేల్చిచెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నిన్న పార్టీ నేతలు ఆయనకు నచ్చజెప్పేందుకు చేసిన యత్నాలేమీ ఫలించలేదు. తనకు సర్దిచెప్పేందుకు వచ్చిన చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఝలకిచ్చిన జ్యోతుల... ఇక మాట్లాడేదేమీ లేదు, ఏదైనా జగన్ తోనే నేరుగా మాట్లాడతానని ముఖం మీదే చెప్పేశారు. పార్టీ మారుతున్న విషయాన్ని ఆయన జగన్ కు ముఖం మీదే చెప్పేందుకు సిద్ధపడటం గమనార్హం. ‘‘మీకూ, మీ పార్టీకి ఓ దండం’’ అంటూ జ్యోతుల చెప్పనున్న మాటకు జగన్ ఎలా స్పందిస్తారన్నది చూడాలి!