: అసోం ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది: ప్రధాని మోదీ
అసోం ప్రభుత్వంపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. ప్రజల నమ్మకాన్ని అసోం ప్రభుత్వం వమ్ము చేసిందని మోదీ విమర్శించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం రెండో రోజున ఆయన పర్యటించారు. సోనిట్ పూర్ జిల్లాలోని రంగపరా ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ, పదిహేనేళ్ల కాలంలో కేంద్రం నుంచి ఎన్నో నిధులు ఈ రాష్ట్రానికి వచ్చాయని, వాటిని ఏ విధంగా వినియోగించారో చెప్పాలని ప్రశ్నించారు. నిధులు పుష్కలంగా ఇచ్చినప్పటికీ అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. ఈ రాష్ట్రంలో జరగనున్న వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. కాగా, అసోంలో వచ్చే నెల 4, 11 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 91 నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేయనుంది. మిగిలిన స్థానాల్లో బీజేపీ కూటమి పార్టీలైన అస్సాం గణపరిషత్, బోడో ల్యాండ్ పీపుల్స్ పార్టీ, మరో రెండు పార్టీలు ఎన్నికల బరిలో దిగనున్నాయి.