: రోహిత్ ఆత్మహత్య నన్ను కలిచివేసింది: కేసీఆర్
హెచ్సీయూ, ఓయూ ఘటనలు బాధాకరమని తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. శాసనసభలో మాట్లాడుతోన్న ఆయన.. రోహిత్ ఆత్మహత్య తనను కలిచివేసిందన్నారు. ఇక రోహిత్ తల్లికి సంఘీభావం తెలిపేందుకే కన్నయ్య వచ్చారని పేర్కొన్నారు. వర్సిటీల్లో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యావిధానం మీద ప్రత్యేక దృష్టి పెడతామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం దళిత వ్యతిరేకి అన్న ఎంఐఎం మాటలపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. శాసనసభలో చర్చ జరగకుండా అడ్డుకున్న ఎంఐఎం నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ విషయంపై చర్చించాలో సూటిగా చెప్పకుండా కార్యకలాపాలు అడ్డుకోవడం సరికాదని సూచించారు. తామెప్పుడూ అలా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. యూనివర్సిటీల్లో ఘటనపై చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చర్చకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా.. సభలో అనవసరంగా నినాదాలు చేయడం సరికాదని అన్నారు.