: దొంగకు ఫైబర్ గ్రిడ్ అప్పగించారు...అతను దొంగ కాదు సమాజ సేవకుడు: జగన్, బాబు వాదోపవాదాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత జగన్ మధ్య ఫైబర్ గ్రిడ్ పై ఆసక్తికర సంవాదం చోటుచేసుకుంది. శాసనసభలో సీఎం మాట్లాడుతూ, ప్రపంచంతో మరింత అనుసంధానమయ్యే దిశగా ఆంధ్రప్రదేశ్ లో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టామని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేవలం 149 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్, టెలిఫోన్ సౌకర్యం కల్పించనున్నామని, ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ సాంకేతికంగా దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే వేగంగా అభివృద్ది అయ్యే దిశగా అడుగులు వేశామని సీఎం చెప్పారు. మూడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఫైబర్ గ్రిడ్ పనులు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఫైబర్ గ్రిడ్ పనులు పూర్తవుతాయని ఆయన తెలిపారు. దీనిపై జగన్ మాట్లాడుతూ, ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టుల్లో అవకతవకలు జరిగాయని అన్నారు. చంద్రబాబునాయుడు బంధువుకు తక్కువ ధరకు ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టు అప్పగించారని ఆయన తెలిపారు. ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టరు గతంలో మహారాష్ట్రలో ఈవీఎం దొంగతనం చేశారని ఆరోపించారు. దీనిపై కేసు కూడా నమోదైందని ఆయన తెలిపారు. అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ఎంటర్ ప్రెన్యూర్ గా అవతారమెత్తారని ఆయన మండిపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆయన చెప్పారు. టెండర్లను ఆహ్వానించామని ఆయన వివరించారు. ఈ కాంట్రాక్టరు తన స్వార్థం కోసం ఈవీఎంను తీసుకువెళ్లలేదని అన్నారు. అసలు ఎవరైనా ఈవీఎంను దొంగతనం చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఈవీఎంలో అవకతవకలు నిరూపించేందుకు ఆయన ఈవీఎంను తీసుకొచ్చారని చంద్రబాబు చెప్పారు. సమాజం కోసం గొప్పపని చేసి ఆయన జైలు కెళ్లారని, స్కాములు చేసి ఆయన (జగన్) జైలు కెళ్లాడని ముఖ్యమంత్రి వ్యంగ్యాస్త్రం విసిరారు.