: ఇటువైపు కేసీఆర్!... అటువైపు జానా, ఒవైసీ!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం ఆ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు... విపక్షాలపై ధ్వజమెత్తారు. అదే సమయంలో కేసీఆర్ వాదనను అటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో పాటు మజ్లిస్ పార్టీ తిప్పికొట్టింది. ఈ సందర్భంగా అసెంబ్లీ అరుపులు కేకలతో దద్దరిల్లింది. వర్సిటీల్లో ఉద్రిక్త పరిస్థితులు, ప్రజా ప్రతినిధుల వాహనాలపై దాడులపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. చర్చకు తామూ సిద్ధంగానే ఉన్నామని చెప్పిన కేసీఆర్... సభ్యులంతా నిర్దేశిత నియమాల ప్రకారమే నడవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన విపక్షాల నేతలతో వాగ్వాదానికి దిగారు. జానారెడ్డితో పాటు మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ చేస్తున్న వాదనపై కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించాలని చూస్తే.. ప్రభుత్వం ఎలా వ్యవహరించాలో కూడా తమకు తెలుసని హెచ్చరించారు. చర్చకు సిద్ధమని ఒప్పుకున్నా, ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాట్లాడుతున్నంతసేపూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఓవైసీలు గట్టిగా కేకలు వేస్తూ ఆయన ప్రసంగానికి అడ్డు తగిలేందుకు యత్నించారు. అంతేకాకుండా ఆ రెండు పార్టీల సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో సభను వరుసగా మూడో పర్యాయం వాయిదా వేస్తూ స్పీకర్ స్థానంలోని పద్మా దేవేందర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.