: హెచ్ సీయూ గేటు వద్ద సొమ్మసిల్లి పడిపోయిన రోహిత్ వేముల తల్లి
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రీసెర్చీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యతో రాజుకున్న వివాదం... సెలవుపై వెళ్లిన వర్సిటీ వీసీ అప్పారావు తిరిగి విధుల్లో చేరడంతో మళ్లీ చెలరేగింది. మొన్న జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ హైదరాబాదుకు వచ్చిన సందర్భంలోనూ హెచ్ సీయూ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. తాజాగా రోహిత్ వేముల తల్లి రాధిక, సోదరుడు వర్సిటీలోకి ఎంటరయ్యేందుకు యత్నించారు. వారిని అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమను లోపలికి అనుమతించాల్సిందేనని రాధిక వాదించారు. ఈ క్రమంలో ఆమె సొమ్మసిల్లిపడిపోయారు. దీంతో మరోమారు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.