: తెలంగాణ స్పీకర్ కు వడదెబ్బ!... పరకాల ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వడదెబ్బకు గురయ్యారు. గతేడాది వేసవిలోనూ వడదెబ్బకు గురైన మధుసూదనాచారి హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వేసవిలోనూ ఆయనకు వడదెబ్బ తగిలింది. రెండు రోజులుగా వరంగల్ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం భూపాలపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయన నిన్న వడదెబ్బతో తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకున్నారు. వడదెబ్బ కారణంగా హైదరాబాదు బయలుదేరిన ఆయన పరకాల చేరుకునేసరికే కళ్లు తిరిగినంత పనవడంతో అక్కడే నిలిచిపోయారు. పరకాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆయన ఆరోగ్యం కుదుటపడిందని సమాచారం. నిన్న తన నియోజకవర్గంలోని రేగొండ మండలం సుల్తాన్ పూర్హ లో రెండు చెరువుల పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ఆ తర్వాత చిట్యాల మండలం ఒడితలలొ సీసీరోడ్లకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కొత్తపేటలో టీఆర్ఎస్ నేత ఇంటిలో మధ్యాహ్న భోజనం ముగించుకుని చల్లగరిగెలో చెరువు పనులను ప్రారంభించారు. చిట్యాలలో 50 పడకల కమ్యూనిటీ ఆసుపత్రికి భూమిపూజ చేశారు. అక్కడే కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో అక్కడికక్కడే ఆయనకు పరీక్షలు చేసిన వైద్యులు వడదెబ్బ సోకినట్లుగా నిర్ధారించారు. తక్షణమే నిమ్స్ కు వెళ్లాలని సూచించారు. దీంతో ఉన్నపళంగా కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హైదరాబాదు బయలుదేరగా, పరకాల వచ్చేసరికే ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో అక్కడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. మధుసూదనాచారికి చికిత్స చేసిన అక్కడి వైద్యులు నిన్న రాత్రికే ఆయనను డిశ్చార్జ్ చేశారు.