: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కు గుండెపోటు... నిమ్స్ ఆసుపత్రికి తరలింపు
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ నేటి ఉదయం గుండెపోటుకు గురయ్యారు. టీడీపీ టికెట్ పై విజయం సాధించిన ప్రకాశ్ గౌడ్ ఇటీవలే టీడీపీకి హ్యాండిచ్చి టీఆర్ఎస్ లో చేరిపోయారు. మైలార్ దేవ్ పల్లి పరిధిలోని దుర్గా నగర్ లోని తన సొంతింటిలో నేటి ఉదయం ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రకాశ్ గౌడ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. సకాలంలో స్పందించిన కుటుంబసభ్యులు ఆయనను క్షణాల్లో ఆసుపత్రికి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తెలుస్తోంది.