: మోడల్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న హార్డిక్ పాండ్య
మొదటి నుంచీ మన క్రికెటర్లకు... మోడలింగ్, సినిమా రంగాలకు మధ్య అవినాభావ సంబంధం వుంది. టీమిండియా ఆటగాళ్లు పలువురు భామలతో సన్నిహిత సంబంధాలు నెరిపిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలోకి తాజాగా వర్ధమాన ఆటగాడు హార్డిక్ పాండ్య కూడా చేరాడని బెంగాలీ పత్రికలు కోడైకూస్తున్నాయి. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ బౌలింగ్ చేసిన పాండ్య సీనియర్ల సలహాలు పాటిస్తూ బౌలింగ్ చేసి, టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అంతే, అభిమానుల దృష్టిలో రాత్రికి రాత్రే సూపర్ స్టార్ గా మారాడు. ఆ మ్యాచ్ అనంతరం పాండ్య కోల్ కతాలోని షాపింగ్ మాల్స్ లో మోడల్ లీసా శర్మతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని బెంగాలీ మీడియా పేర్కొంది. జంషెడ్ పూర్ కు చెందిన లీసా శర్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో హార్డిక్ పాండ్యతో దిగిన సెల్ఫీని పోస్టు చేసింది. దీంతో పాండ్య ప్రేమ వ్యవహారం నిజమే అంటూ మరిన్ని కథనాలు వెలువడ్డాయి. వెంటనే స్పదించిన లీసా శర్మ ఆ ఫోటోను తక్షణం తొలగించింది. ఈ మధ్యే అనుష్క శర్మతో విరాట్ కోహ్లీ ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడం... మళ్లీ అతుక్కునే దిశగా ప్రయత్నాలు మొదలవడం మనకు తెలిసిందే. ఇంతలోనే పాండ్య వ్యవహారం వెలుగు చూడడం విశేషం!