: కరెంటు ఉండగానే చదువుకోండి: విద్యార్థులకు కర్ణాటక ప్రభుత్వం సూచన
కర్ణాటక రాష్ట్రం తీవ్ర విద్యుత్ కొరతతో విలవిల్లాడుతోంది. సాక్షాత్తు సచివాలయంలో బడ్జెట్ ను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మొబైల్ టార్చ్ వెలుగులో ప్రవేశపెట్టారంటే అక్కడి విద్యుత్ కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కర్ణాటకను రెండు వేల మెగావాట్ల విద్యుత్ కొరత పట్టిపీడిస్తోంది. దీంతో విద్యుత్ కోతలు, నీటి ఎద్దడితో కర్ణాటక విలవిల్లాడుతోంది. పరీక్షల సమయంలో విద్యుత్ కోతలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి పరిష్కారం ఏంటి? అని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కర్ణాటక సర్కారును నిలదీసింది. దీనిపై విద్యుత్ శాఖ మంత్రి శివకుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించిందని, వారి కోసం ఓ టైంటేబుల్ సెట్ చేశామని అన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెల్లవారుజామున 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరుకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉంటుందని ఈ సమయాల్లో విద్యార్థులు చదువుకోవాలని సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్టడీ అవర్స్ లో ఎలాంటి అంతరాయం రాకూడదని విద్యుత్ సరఫరా చేస్తున్న ఐదు విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆదేశాలు జారీ చేశామని ఆయన చెప్పారు.