: పాక్ తో మ్యాచ్ రోజున 'జై పాకిస్థాన్' అని కష్టాలు కొని తెచ్చుకున్న కర్నాటక విద్యార్థి
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రసవత్తర పోరు సాగుతున్న వేళ, వాట్స్ యాప్ వేదికగా, ఓ గ్రూప్ మధ్య జరిగిన సంభాషణ, పోలీసుల వరకూ వెళ్లి ఓ విద్యార్థికి కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో జరుగగా, ఎస్పీ శరణప్ప వెల్లడించిన వివరాల ప్రకారం, మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఓ విద్యార్థి తన గ్రూప్ చాట్ విండోలో 'జై పాకిస్థాన్' అని మెసేజ్ పెట్టగా, అదే గ్రూప్ లోని మరో విద్యార్థి దాన్ని స్క్రీన్ షాట్ తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. అది అలా అలా పాకుతూ పోలీసులకు చేరింది. దీంతో విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చివరకు వారికేమీ చెడు ఉద్దేశాలు లేవని తెలుసుకుని వార్నింగ్ తో వదిలిపెట్టారు.