: ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరవుతా!... న్యాయవ్యవస్థపై నమ్మకముందంటున్న రోజా
వైసీపీ నేత, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎట్టకేలకు ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మొన్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణం నుంచి నిమ్స్ ఆసుపత్రి బెడ్ పైకి చేరిన రోజా... కొద్దిసేపటి క్రితం హైదరాబాదు లోటస్ పాండ్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం, అసెంబ్లీ మార్షల్స్ పై ఘాటు వ్యాఖ్యలు గుప్పించిన ఆమె... ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు హాజరవుతానని చెప్పారు. న్యాయవ్యవస్థపై తనకు ఇంకా నమ్మకముందని ప్రకటించిన ఆమె, ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు హాజరయ్యేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించారు. తనపై విధించిన సస్పెన్షన్ కు సంబంధించిన వివాదంలో చివరకు తానే గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.