: కరుణానిధిపై అదను చూసి దెబ్బ... 65 సీట్లకు కాంగ్రెస్ డిమాండ్!
తమిళనాడులో ఎన్నికల రాజకీయాలు అత్యంత ఆసక్తిని కలిగిస్తున్నాయి. జయలలిత ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో బలమైన కూటమిని ఏర్పాటు చేసుకోవాలన్న డీఎంకే అధినేత కరుణానిధి ఆశలపై నీళ్లు చల్లుతూ డీఎండీకే నేత విజయకాంత్ వామపక్షాలు, వైగోతో పొత్తు పెట్టుకున్న వేళ, అదే అదనుగా కాంగ్రెస్ గొంతెమ్మ కోరికలతో తన డిమాండ్ల చిట్టాను కరుణ ముందు ఉంచింది. పొత్తు కుదుర్చుకునేందుకు డీఎంకేకు కాంగ్రెస్ మినహా మరో పార్టీ అందుబాటులో లేకపోవడంతో 234 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో కనీసం 65 సీట్లను తమకివ్వాలని కోరుతున్నట్టు సమాచారం. ఇదే డిమాండుతో రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ నేడు చెన్నైకి వచ్చి సీట్ల సర్దుబాటుపై కరుణానిధితో ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో కలసి బరిలోకి దిగి కేవలం 5 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో పెద్దగా ప్రజాబలం లేని కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లను ఇవ్వడం అనుమానమేనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జీకే వాసన్ పార్టీని వీడి తమిళ మనీల కాంగ్రెస్ ను పునరుద్ధరించడంతో పార్టీ బలహీనపడిందని వివరించారు. ఇక కాంగ్రెస్ ఒత్తిడికి డీఎంకే అధినేత తలొగ్గుతారా? అన్నది నేడు తేలుతుంది.