: బాలయ్యపై ఇండియా టుడే ‘ది లెజెండ్’ సంచిక!... ఆవిష్కరించిన చంద్రబాబు


టాలీవుడ్ అగ్ర నటుడు, అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణపై ప్రముఖ జాతీయ వార పత్రిక ‘ఇండియా టుడే’ ఓ ప్రత్యేక సంచికను విడుదల చేసింది. ‘ది లెజెండ్’ పేరిట రూపొందిన సదరు సంచికను ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న హైదరాబాదులోని సచివాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బాలయ్య కూడా హాజరయ్యారు. తనపై విడుదలైన సదరు సంచిక తొలి ప్రతిని ఆయనే అందుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమాజంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు సంబంధించిన పుస్తకాలు రావాల్సి ఉందని ఆయన చెప్పారు. ప్రముఖుల జీవిత చరిత్రలకు సంబంధించిన విషయాలను వేర్వేరు చోట్ల చదువుకోవడం కంటే ఒకే చోట గుదిగుచ్చినట్లు ఉండే ప్రత్యేక సంచికలతో తెలుసుకోవడం బాగుంటుందన్నారు. ఇలాంటి పుస్తకాలు భవిష్యత్తు తరాలకు రెఫరెన్స్ లా ఉపయోగపడతాయన్నారు. ఐదారు నెలల పాటు శ్రమించి తనకు సంబంధించిన వివిధ కోణాలను క్రోడీకరించి ప్రత్యేక సంచికను రూపొందించేందుకు ఇండియా టుడే సిబ్బంది చేసిన కృషిని బాలయ్య అభినందించారు.

  • Loading...

More Telugu News