: దక్షిణ కొరియా ఇంటర్నెట్ స్పీడు 26.7 ఎంబీపీఎస్...మరి భారత్ లో?
ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల కల్పనలో దక్షిణ కొరియా దూసుకుపోతోంది. దేశ జనాభాలో 83 శాతం పట్టణ ప్రజానీకం కలిగిన దక్షిణ కొరియాలో ఇంటర్నెట్ మినిమమ్ స్పీడు 26.7 ఎంబీపీఎస్ అంటే ఆశ్చర్యం కలుగుతుంది. గతేడాది సియోల్ రహదారిపై 81.9 ఎంబీపీఎస్, చెంగ్జూ నగరంలో 124.5 ఎంబీపీఎస్ స్పీడు నమోదైందంటే ఇక్కడ ఆన్ లైన్ సేవలు ఎంత వేగంగా అందుతాయో ఊహించవచ్చు. 1995లో ఆ దేశంలో ప్రతి 100 మందిలో ఒక్కరు మాత్రమే ఇంటర్నెట్ వినియోగించేవారు. ఆ ఏడాది కొరియన్ ఇన్ ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు చేపట్టారు. 1998 నాటికి ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ ప్రాంతాలను దీనితో అనుసంధానం చేశారు. 2000 నాటికి దేశంలోని 40 మిలియన్ల జనాభాలో 20 మిలియన్ల జనాభాను ఇంటర్నెట్ తో అనుసంధానం చేశారు. దక్షిణ కొరియాలో ప్రధానంగా మూడు కంపెనీలు ఐఎస్ పీలుగా వ్యవహరిస్తున్నాయి. ఈ మూడింటి మధ్య నెలకొన్న పోటీ వాతావరణం కారణంగా తక్కువ ధరకే నాణ్యమైన ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ మూడు కంపెనీలకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుంది. దీంతో ఆ కంపెనీలు అక్కడ రాయితీకే నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాయి. దీంతో ఇంటర్నెట్ వాడకంలో దక్షిణ కొరియా దూసుకుపోతోంది. ఇదే సమయంలో భారత్ లో సగటు ఇంటర్నెట్ అందే స్పీడు 2.8 ఎంబీపీఎస్ ఉండగా, ప్రపంచ వ్యాప్తంగా దీని స్పీడు 5.6 ఎంబీపీఎస్ గా ఉంది!