: తెలుగుదేశంతో కలసిపోయిన వైకాపా: రఘువీరా విసుర్లు
ఆంధ్రప్రదేశ్ ప్రజలను భారతీయ జనతా పార్టీ మోసం చేస్తుంటే తెలుగుదేశంతో పాటు వైకాపా కూడా నోరు మెదపడం లేదని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించుకుని రావడంలో చంద్రబాబు విఫలమయ్యారని, గత కొంతకాలంగా వైకాపా కూడా ఆ ఊసే ఎత్తకుండా తెలుగుదేశంతో కలసిపోయిందని ఆయన అన్నారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, బాబు సర్కారు సొంత ఎజెండాతో పనిచేస్తోందని దుయ్యబట్టారు. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఉన్న ఉద్యోగాలను ఊడబీకుతున్నారని అన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో తుగ్లక్ పాలన సాగుతోందని, వీరికి ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.