: బ్రస్సెల్స్ దాడికి పాల్పడింది వీరే... చిత్రాల విడుదల!
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో ఎయిర్ పోర్టులో ఆత్మాహుతి దాడికి దిగిన ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో పాటు, తప్పించుకున్నాడని భావిస్తున్న మరో ముష్కరుడి చిత్రాన్ని ఆ దేశ ఫెడరల్ ప్రాసిక్యూషన్ అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు మీడియాలో వచ్చిన చిత్రాలే అనుమానితులవని ఆయన స్పష్టం చేశారు. బ్రస్సెల్స్ లోని చెకిన్ టర్మినల్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల మేరకు, వీరు ముగ్గురూ సూట్ కేసులున్న ట్రాలీలను తోసుకుంటూ వస్తున్నారు. ఇద్దరు నలుపురంగు జాకెట్లను వేసుకుని ఉండగా, మరో వ్యక్తి గ్రే కలర్ సూట్ ధరించివున్నాడు. వీరు ముగ్గురూ ఏ మాత్రం ఆందోళన లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. కాగా, బ్రస్సెల్స్ ఎయిర్ పోర్టులో దాడికి 100 పౌండ్ల టీఏటీపీ (ట్రియాసిటోన్ ట్రిప్పర్ ఆక్సైడ్) పేలుడు పదార్థాలను వాడి వుండవచ్చని యూనివర్శిటీ ఆఫ్ రోడ్ ఐలాండ్, రసాయన శాస్త్ర ప్రొఫెసర్ జిమ్మీ సీ ఆక్స్ లీ వ్యాఖ్యానించారు. వీరు నడుముకు బాంబుల బెల్టుతో పాటు సూట్ కేసుల్లోనూ బాంబులతో వచ్చి వుంటారని ఆమె అంచనా వేశారు. ఇదిలావుండగా, ఆత్మాహుతి దాడి చేసుకున్నారని భావిస్తున్న వారి మృతదేహాల వద్ద 9 ఓల్టుల బ్యాటరీ, ఎలక్ట్రిక్ వైర్లు, కరిగిన ప్లాస్టిక్ పదార్థం లభ్యమైనట్టు అధికారులు వివరించారు. తప్పించుకున్నాడని భావిస్తున్న వ్యక్తి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.